🌹 *తిరుప్పావై ~ మూడవ పాశురము:* 🌹
(సేకరణ: పి.యల్.నరసింహాచార్య దాసన్)
(18.12.21)
వ్రత ఫలము ~వ్రతము చేయువారికే కాక లోకమంతటికీ ఆనందదాయకము కావాలనే కోరికను ఈ పాశురములో కోరుతున్నారు గోదమ్మ తల్లి; అంతేకాదు. భగవద్భక్తులకు దిక్పాలకులు సైతము దాసులౌతారు, భాగవతాజ్ఞకు కట్టుబడి మసలుకుంటారు. ఎందుచేతనంటే భాగవతుల మనసునిండా పరమాత్మ నిండివుంటారు. అందువలన వారి మాట పరమాత్మ ఆజ్ఞగా భాసిస్తుంది. నిప్పుసెగతగిలిన మంచులాగా పరమాత్మ సాన్నిధ్యంకలిగిన మనసులలో పాపము, స్వార్థము కరిగి నామరూపాలు లేకుండపోతుంది కదా నిస్వార్థమే మిగిలివుంటుంది. వారిమాట యెప్పుడు లోకహితాన్నే ఆకాంక్షిస్తుంది.
*ఓంగి ఉలగు అళంద (ఉలగళంద) ఉత్తమన్ పేర్ పాడి*
*నాంగళ్ నంపావైక్కు చ్చాత్తి(చాట్రి) నీరాడినాల్*
*తీంగు ఇన్రి (తీంగిన్రి) నాడు ఎల్లాం (నాడెల్లాం) తింగళ్ ముమ్మారి పెయ్దు*
*ఓంగు పెరుం శెన్నెల్ ఊడు (శెన్నలూడు) కయల్ ఉగళ (కయలుగళ)*
*పూంగు కువళై ప్పోదిల్ పొరి వణ్డు కణ్పడుప్ప*
*తేంగాదే పుక్కు ఇతుందు (పుక్కిరుందు) శీర్త ములై పత్తి(పట్రి) వాంగ*
*కుడం నిరైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్*
*నీంగాద శెల్వం నిరైందు ఏలో (నిరైందేలో) రెంబావాయ్*
*ప్రతి పదార్థాలు:*
*ఓంగి ఉళగు అళంద ఉత్తమన్ పేర్ పాడి* ~ బాగుగా పెరిగి లోకములను కొలచిన ఉత్తముని నామమును కీర్తించి;
*నాంగళ్ నంపావైక్కు* ~ మేము మా వ్రతానికి;
*చాట్రి నీరాడినాల్* ~ (ఇక్కడ ‘ற்ற’ అనే తమిళాక్షరాన్ని ‘త్త ‘గా పలకాలి. పెరుమాళ్ళవద్ద ప్రబంధం సేవించేటప్పుడు పరుషశబ్ధాలను సైతం సరళంగానే పలకాలని పెద్దలు చెప్పిన విషయం) ప్రకటించి నీరాడిన నాడు (స్నానము చేసిన నాడు);
*తీంగు ఇన్ఱి*~ ఉపద్రవములు లేక;
*నాడెల్లామ్* ~ దేశమంతయునూ;
*తింగళ్ ముమ్మారి పెయ్ దు*~ నెలకు మూడు మారులు వానలు కురిసి;
*ఓంగు పెరుమ్ చెన్నల్ ఊడు కయల్ ఉగళ*~ పెరిగిన పెద్ద ఎర్రని పైరు మధ్య చేపలు త్రుళ్ళి పడగా;
*పూంగు వళై పోదిల్* ~ కలువల యొక్క పొదలలో;
*పొరివణ్డు కణ్ పడుప్ప*~ రాణించు తుమ్మెదలు కనపడగా;
*తేంగాదే పుక్కి ఇఱున్దు*~ సంకోచింపక కొట్టమున ప్రవేశించి ఉండి;
*శీర్తములై పற்றி వాంగ*~ బలిసిన పొదుగులను పట్టి పిండగా;
*క్కుడమ్ నిరైక్కుమ్* ~ కుండలు నిండునట్లుగా;
*వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్* ~ ఉదారములైన పెద్ద ఆవులు;
*నీంగాదే శెల్వమ్* ~ ఎడతెగని సంపదలు;
*నెరైందు* ~ నిండునట్లు;
*భావము:*
తాము ఈ వ్రతమునాచరించుటకు అంగీకరించిన వ్రేపల్లెలోని వారికి చక్కని పాడిపంటలు కలుగవలయునని ఆకాంక్షిచుచున్నాము. పెరిగి లోకములను మూడడుగులతో కొలిచిన ఉత్తముడగు త్రివిక్రముని నామమును మేము కీర్తించెదము. మేము మా వ్రతమను మిషతో స్నానమాడినచో సకల లోకములు ఆనందించును. ఈతి బాధలు లేకుండగా దేశమంతా నెలకు మూడు వానలు కురియును. ఈ వ్రతము వలన లోకములో పాడిపంటలు సమృద్దిగా ఉండును. పెరిగిన పెద్ద వరి చేలలో చేపలు త్రుళ్ళి పడుచుండును. పూచిన కలువపూవులో అందమైన తుమ్మెదలు నిద్రించుచుండును. జంకకుండ కొట్టములో ప్రవేశించి కూర్చుండి బలిసి ఉన్న పొదుగును పట్టి పాలు పిదుకుచుండగా కుండల కుండల పాలను అక్కడ ఆవులు ఇస్తూంటాయి. ఇవి ఉదారములగు ఆవులు. లోకమంతటా తరగని సంపద నిండి ఉండును.
*ఇందులోని విశేషార్థాలు:*
*ఈ పాశురం అంతట భాగవతలక్షణాలను వర్ణిస్తున్నందున దీనిని విశేషపాశురమన్నారు కావచ్చు…*
*ఈతిబాధలు ఆరు: అతివృష్టి ~ అనావృష్టి ~ ఎలుకలు ~ చిలుకలు ~ మిడుతలు ~ దుష్టులగు రాజులు.*
*ఆరు ఈతి బాధలు: దేహాత్మ బుద్ది ~ నేను*
*స్వతంత్రుడను బుద్ది ~ పరమాత్మ అని కాక ఇతరులకు చెందినవాడను బుద్ది~ తనను తాను రక్షించుకొనగలనను బుద్ది ~ శరీరబంధువులే బంధువులను బుద్ది ~ శబ్దాది విషయములను అనుభవింపవలయునను బుద్ది.*
*ఇక మూడు వానలనగా ~ పరమాత్మ తప్ప ఇతరులకు చెందిన వాడనుగానను బుద్ది; పరమాత్మయే తప్ప ఇతరమగునది ఉపాయము కాదను బుద్ది ~ పరమాత్మానుభవము తప్ప ఇతరమగునది నాకు రుచింపదను బుద్ది;*
*క్ధేత్రమనగా శరీరము ~ క్ధేత్రమున అడుగున జలమనగా పరమాత్మ; చేపలనగా భగద్ద్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు. ఈ నీటిలో పూలనగా జీవుల హృదయాలు. అందులోని తుమ్మెదలు అనగా లక్ష్మీనారాయణులు. వారి కలహము జీవుల పరిపాలన విషయముననే. పొదుగులు ముట్ట్నంతనే పాలను ఆగక ధారగా కురిపించు ఆవులే ఆచార్యపురుషులు. వారివద్దకు చేరి పరిప్రశ్న చేయడమే ఆలస్యం తమవద్దనున్న జ్ఞానసంపదనంత ధారపోయడానికి సిద్ధమైనవారే ఆచార్యులు.*
*అనువాద సీస పద్యము:*
(రచయిత: కీ. శే . కుంటిమద్ది శేష శర్మ గారు:)
*మెల్ల మెల్ల మినుమించి మెయివెంచి*
*లోకాల గొలిచిన పెరుమాళ్ళ, గొలిచి మేము*
*నోమదానముసేయ బాములెల్లను డిందు*
*నెల మూడువానలు నెమ్మి గురియు,*
*వెన్ను వంగిన మఖ్ళ జెన్నొందు కలువ పూ*
*పొదలతో మించు తుమ్మెదలు మొదలు,*
*కయ్యల నీటిలో గాడలు కదలంగ*
*దుడుకు బేడిసలు దుందుడుకు సేయు*
*కుండ పొదుగుల పశువులు గోష్టములను*
*పిడికిలికి వెక్కసంబగు కొడులబట్టి*
*పిండ గురియును కడవలు నిండబాలు*
*సంపదలు వెల్లవలు గట్టి పెంపుదనర!*
*(ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్)*