🌹 *తిరుప్పావై~1*
(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్:
Edited by ఫణిహారం రంగనాథ్)
(16.12.21)
నీళాత్తుంగ స్థనగిరితటీ
శ్లోకానికి తెలుగు అనువాద పద్యమిది. దీని రచయిత శ్రీ పార్థసారధి అయ్యంగార్ గారు — వారి *శ్రీ గోదా స్థుతిమాల* పుస్తకములోనుంచీ గ్రహించినది.
*నీలా తుంగ పయోథరాచల తటిన్ నిద్రించు శ్రీకృష్ణుగ*
*పాలున్ లేపి స్వకీయ మాల్య నిగళే బద్దాంగునింజేసి వే*
*దాలం దెల్పిన పారమార్థ్యమును నధ్యాపించు చానంద లీ*
*లా లోలాత్మత నొప్పు గోదకు నతుల్ గావింతు నెల్లప్లుడున్*
*పాశురము ~ 1*
(వ్రతఫలము ~ వ్రతఫల సాధనము ~ వ్రతము చేయతగ్గవారు ఎవరని పాశురము అర్థము. ళ్ ~ నాలుక మధ్యకు మడిచి ష ~ ళ ~ లను మిశ్రమంచేసి పలకండి.)
*మార్గళి త్తింగళ్ మదినిరైంద నన్నాళాల్*
*నీరాడప్పోదువీర్ పోదుమినో నేర్ ఇళైయీర్(నేరిళైయీర్)*
*శీర్ మల్గు మాయ్ ప్పాడి శెల్వచ్చిరుమీర్ గాళ్*
*కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*
*ఏరార్ న్దకణ్ణి యశోదై ఇళమ్ శిింగమ్ (చింగమ్)*
*కార్ మేని శెమ్ కణ్ (చెంగణ్) కదిర్ మదియంపోల్ ముగత్తాన్*
*నారాయణనే నమక్కే పరై తవువాన్*
*పారోర్ పుగళ ప్పడిన్దు ఏలో (పడిన్దేలో) రెమ్బావాయ్*
*ప్రతి పదార్థాలు:*
*మార్గళిత్తింగళ్* ~ మార్గశిర మాసమున;
*మది నిరైంద నన్నాళ్* ~ చంద్రుడు నిండింన దినములు;
*నీరాడ ప్పోదువీర్*~ (నీరాడుటకు) స్నానము చేయుటకు పోవువారలారా;
*పోదుమినో*~ పోవుదమా;
*నేరిళైయీర్*~ విలక్షణమైన ఆభరణములు గల వారా;
*ర్మల్గుమ్ *~ అందమైన;
*ఆయ్ పాడి చెల్వచ్చిరు మీర్ కాళ్ *~ గొల్లపల్లె యందలి చిన్ని కన్నె లారా;
*కూర్వేవేల్*~ వాడి బల్లెము గల;
*కొడున్ దొళిలన్*~ క్రూర కార్యములు గల;
*నందగోపన్ కుమరన్*~ నందగోపుని కుమారుడు;
*ఏరా రంద కణ్ణి*~ అందము నిండిన కన్నులు గల;
*శోదై ఇళమ్ శింగమ్(చింగమ్)*~ యశోద యొక్క లేత సింగమును;
*కార్మేని చ్చెంగణ్*~ నల్లని మేను గల ఎర్రని కన్నులు గల;
*కదిర్ మదియం పోల్ ముగత్తాన్* ~ సూర్య చంద్రులను పోలిన ముఖముకలవాడు నగు;
*నారాయణనే నమక్కే* ~ నారాయణుడే మనకు;
*పరై తరువాన్*~ కోరికలను తీర్చువాడు;
*పారోర్ పుగళ* ~ పౌరులు పాడగా;
*పడిందు ఏలో రెంబావాయ్* ~ పూనినదే మా వ్రతము!
*తాత్పర్యము:*
చెలియల్లారా! రండి! సంపత్కరములైన సర్వాభరణాలతో విరాజిల్లుతున్న
గోపికలారా రారండి. ఈ రోజు పవిత్రమైన మాసములోని మొదటి రోజు~ పున్నమి వెన్నెల పిండారబోసినట్లున్న వేకువ జాము. నందుని అనుంగు బిడ్డ, యశోదమ్మ ముద్దులపట్టి అయిన బాలకిశోరాన్ని సేవించి తృప్తిదీరా సర్వశుభాలను పొందుటకు ఈ వేకువన చన్నీట జలకాలాడి సేవించుటకు పోదాము రారే!
*వ్యాఖ్య:*
*యం ప్రాప్య న నివర్తంతే తద్దామ పరమంమమ* అని భగవంతుని స్థానము చేరిన మీదట తిరిగి రాకలేదు. త్రిపాద్విభూతిలో పరమపదము వైకుంఠము నా స్థానమన్నాడు శ్రీమన్నారాయణుడు. దానిని అనుగ్రహించేవాడు నారాయణుడే! కనుక *నారాయణనే నమక్కే పరైతరువాన్* అని అంటున్నది మన గోదమ్మ తల్లిఈ మొదటి పాశురములో! అతనినే కీర్తించవలయును, సేవింపవలయును; అతడే మన కోరికలను
తీర్చును; మనకు మనమెవ్వరము? క్రిమి కీటక పశు పక్ష్యాది శరీరాలను ఒకటి వెంట ధరిస్తూ పలు జన్మలెత్తి ఇప్పుడు ఈ మానవ శరీరాన్ని పొందిన జీవులము. *యస్యాత్మా శరీరం* అని, భగవతునికి శరీరభూతులము.
*మమైవాంశో జీవలోకేజీవభూతస్సనాతనః* అనిపురుషోత్తమునికి అంశభూతులము; అతడు శేషి; మనము శేషులము. అందుకే నరులమైన మనము ఆయనను ఆశ్రయిస్తే మన కోరికలను
నెరవేరుస్తాడు.
*అనువాద సీస పద్యము:( రచయిత ~ కీ.శే. కుంటిమద్ది శేష శర్మ గారు):*
*సిరి సంపదలు నగల్ చెలువమ్ము పరువమ్ము*
*కొమరారు రేపల్లె కొమిరెలార!*
*పూర్ణచంద్రునితోడ బొలుపొందు మార్గశీ*
*ర్షమునందు వేకువ జామునందు,*
*వాడి బల్లెము వేడి పనుల నందుని పుత్ర*
*కేసరి యా యశోదాసుతుండు*
*పుష్ప సన్నిభమైన మోము కెందామరల్*
*మించు కన్నుల కర్రి మేను వాడు*
*అఖిల మొసగును మనకు నారాయణుండు;*
*లోకులగ్గింప బూని యో లోలనేత్ర*
*లార; యాతని పూజింపగోరి నీరు*
*మాడ బోదము రండు రండతివలారా!*
*(ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్)*